సుబ్లేడు హైస్కూల్ 1976–1981 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
తిరుమలాయపాలెం అక్టోబర్ 4 (నమస్తే న్యూస్)
మానవ సంబంధాలు దూరం అవుతున్న సమయంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా చెదరని స్నేహబంధం వారిని మళ్లీ ఒక్కచోట చేర్చింది. సుబ్లేడు హైస్కూల్లో 1976–1981 సంవత్సరాల మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు 44 సంవత్సరాల తర్వాత అప్పుడు చదివిన అదే సుబ్లేడు స్కూల్లో ఆత్మీయంగా ఆదివారం కలుసుకుని అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేటు రంగాల్లో వ్యాపారాలలో స్థిరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ రిటైర్మెంట్ అయ్యారు. వారి కుటుంబ బంధాలను తెలియజేస్తూ స్నేహితులతో సంతోషంగా గడిపారు. 44 సంవత్సరాల క్రితం సుబ్లేడు స్కూల్లో అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అప్పటి గురువులు, పాఠశాల, తరగతి గదులు, ఆటపాటలు, కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని ఆనందంగా ముచ్చటించుకున్నారు. వయసు పెరిగినా స్నేహానికి వయసు లేదని నిరూపిస్తూ, అప్పటి ఆప్యాయతను నేటికీ కొనసాగించడం పట్ల పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
44 ఏళ్ల విరామం తర్వాత కలుసుకున్న స్నేహితుల్లో ఆనందం ఎల్లలు దాటింది. కొందరు భావోద్వేగానికి లోనై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకుంటూ, ఇకపై కూడా తరచూ కలుసుకుంటూ ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సమ్మేళనం తమ జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. కాలం గడిచినా.. దూరాలు పెరిగినా.. నిజమైన స్నేహానికి ఎల్లలు ఉండవని ఈ ఆత్మీయ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. అనంతరం అప్పటి ప్రధానోపాధ్యాయులు విటల్ రావు.. రాధాబాయి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకు శశిధర్, వెంకటేశ్వరరావు, అస్గర్ ఖాన్, ప్రసాద్, భువనగిరి వెంకటేశ్వర్లు, గంధసిరి మల్లయ్య తూమట్ల విజయకుమార్ డీలర్ వెంకన్న, రామ్ రెడ్డి, సీత, శారద, చంద్రకళ, విజయ్ కుమార్, రాగ్య నాయక్, శ్రీరాములు, గంధసిరి లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

