క్రీడా రంగంలో ఖమ్మం ఖ్యాతిని పెంచుతున్న వేణు సేవలు అభినందనీయం, మంత్రి పొంగులేటి.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 26 (నమస్తే న్యూస్ )
ఖమ్మం పట్టణానికి చెందిన సుమన్ షూటర్స్ అకాడమీ ఇండియా ఉపాధ్యక్షులు, కరాటే క్రీడాకారుడు కరాటే వేణు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రిల్ 26న నిర్వహించిన, ప్రతిష్టాత్మక కరాటే కార్యక్రమంలో సుమారు 2,000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా నిర్వహించిన, ఈ కార్యక్రమంలో ఖమ్మం నుంచి పాల్గొన్న కరాటే వేణు తన ప్రతిభను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరాటే వంటి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖమ్మం జిల్లాకు గర్వకారణమని, కరాటే వేణు సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంపొందిస్తూ, మరింత మంది క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వేణు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
భారీ సంఖ్యలో కరాటే క్రీడాకారులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం క్రీడా రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖమ్మం నుంచి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించిన కరాటే వేణును పలువురు క్రీడాభిమానులు అభినందించారు.
క్రీడా రంగంలో ఖమ్మం ఖ్యాతిని మరింత పెంచేలా కరాటే వేణు చేస్తున్న కృషి అభినందనీయమని ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ బాయ్, చల్లా రామకృష్ణారెడ్డి, దుర్గాబాయి, వట్టికొమ్మ శ్రీనివాసరెడ్డి, మందడపు నాగేశ్వరరావు, మొగిలిచర్ల సైదులు, కొప్పెర ఉపేందర్, విఫ్లౌ, ప్రసాద్ ఎయిర్టెల్ నరసరావు తదితరులు పేర్కొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ, కరాటే వేణు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
