ఆనకట్ట నిర్మాణంలో జాప్యం,రైతనంగానికి ఇబ్బందులు.
ఆనకట్ట పూర్తయితే ఐదు మండలాల్లో 20 వేల ఎకరాలకు సాగునీరు.
భూగర్భ జలాల పెరిజిస్టార్ మరో 5 వేల ఎకరాలకు ప్రయోజనం.
ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించాలి.
సీపీఎం జిల్లా నేతలు అల్వాల వీరయ్య.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల ఆనకట్టను వెంటనే నిర్మించి రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య,మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తానంచర్ల ఆనకట్ట ప్రాంతాన్ని సందర్శించిన నాయకులు స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2024లో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్ట తెగిపోవడంతో అప్పటి నుంచి రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పంటలు సాగు చేయలేకపోవడంతో పాటు భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయని పేర్కొన్నారు.ఆనకట్టకు సంబంధించిన కుడి,ఎడమ కాలువలు సైతం చెట్లు,పిచ్చిమొక్కలతో నిండిపోయి శిథిలావస్థకు చేరాయని అన్నారు.ఆనకట్ట పూర్తిస్థాయిలో పనిచేస్తే పాలేరు వాగు నీటిని నిల్వ చేసి కుడి,ఎడమ కాలువల ద్వారా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు.అదనంగా మరో 5 వేల ఎకరాలకు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సుమారు 16 ఏళ్ల క్రితమే ఆనకట్ట నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసి,భూసేకరణకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ పనులు పూర్తికాకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆనకట్ట నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.వర్షాభావ పరిస్థితులు,సాగునీటి కొరత కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయని,ఈ పరిస్థితుల్లో ఆనకట్ట నిర్మాణం పూర్తయితే రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు బాణాల రాజన్న,తాటికొండ అనంతచారి,అల్లి శ్రీనివాస్‌రెడ్డి,షేక్ షరీఫ్,బాసు నాయక్,తాడూరి వీరింకులు,నలబోలు లక్ష్మారెడ్డి,స్థానిక రైతులు భూక్య నాగు,భూక్య వెంకన్న,మల్సూరు,అజ్మీర గోపి తదితరులు పాల్గొన్నారు..

