కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.
బురహాన్పురంలో ఘనంగా సీఐటీయూ మండల విస్తృతస్థాయి సమావేశం.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 20(నమస్తే న్యూస్).
భవన నిర్మాణ కార్మికులు,అసంఘటిత రంగ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నాయకులు ముదం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక,కార్మిక విధానాలు కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.ఆదివారం మరిపెడ మండలం బురహాన్పురం గ్రామంలో కొండ ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ మండల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన యూనియన్ గద్దెను ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు.అనంతరం కార్మికులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను బలహీనపరిచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు.29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక నియమావళిలుగా మార్చడం వల్ల ఉద్యోగ భద్రత,వేతనాలు,సామాజిక భద్రత,సంఘటిత హక్కులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు సకాలంలో అందకపోవడంతో అనేక మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.కార్మికుల నుంచి వసూలు చేస్తున్న సెస్ నిధులను సంక్షేమ పథకాల కోసం సకాలంలో వినియోగించాలని డిమాండ్ చేశారు.ప్రమాద బీమా నిబంధనల్లో మార్పులు కార్మికులకు ప్రతికూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.పెరుగుతున్న ధరలు,నిరుద్యోగం,ప్రైవేటీకరణ,కాంట్రాక్టీకరణ,ఉపాధి అస్థిరత వంటి సమస్యలు కార్మిక కుటుంబాలపై భారాన్ని పెంచుతున్నాయని అన్నారు.ఎనిమిది గంటల పని విధానం,కనీస వేతనం,ఈఎస్ఐ,పీఎఫ్,ప్రమాద బీమా,ప్రసూతి సెలవులు,సామాజిక భద్రత వంటి హక్కులు దశాబ్దాల కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్నవేనని గుర్తుచేశారు. వాటిని కాపాడుకోవడానికి నిరంతర పోరాటం అవసరమన్నారు.అసంఘటిత,వలస,యువ కార్మికులను సంఘటితం చేసి బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.అక్టోబర్ 27న నిర్వహించనున్న చలో హైదరాబాద్,డిసెంబర్ 1,2 తేదీల్లో నిర్వహించనున్న చలో పార్లమెంట్–ఢిల్లీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.సిద్దిపేటలో జరిగే రాష్ట్ర వర్కింగ్ క్లాస్ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.ఈ సమావేశంలో బిల్డింగ్ రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం,సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి,జిల్లా ఉపాధ్యక్షుడు దుండి వీరన్న,కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జిన్నా లచ్చయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బాణాల రాజయ్య,తిరుమలాయపాలెం మండల కన్వీనర్ వశిపొంగు వీరన్న,మండల కార్యదర్శి కొండ వెంకన్న,గ్రామ అధ్యక్షుడు వీరసాని శ్రీనివాస్,కార్యదర్శి సోమవారపు సైదులు,మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి,నాయకులు సైదులు,జామ్మూర్తి,భూష్పక ముత్తయ్య,కోడి లింగన్న తదితరులు పాల్గొన్నారు..


