- ఘనంగా ‘లక్ష విత్తన బంతుల’ పంపిణీ కార్యక్రమం
రిపోర్టర్ : దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 18 (నమస్తే న్యూస్)

పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘వన్ లాఖ్ సీడ్ బాల్స్’ (లక్ష విత్తన బంతులు) కార్యక్రమం శుక్రవారం మండలంలో ఘనంగా ప్రారంభమైంది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆద్వర్యంలో, ఇండియన్ కామన్ ఫార్మర్స్ క్లబ్ నేతృత్వంలో తేట్టెలపాడు గ్రామ మహిళా సర్పంచ్, డ్వాక్రా మహిళలకు 500 సీడ్ బాల్స్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఇండియన్ కామన్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఆదర్శ రైతు బొమ్మగాని నరసింహారావును సర్పంచ్, మహిళలు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తేట్టెలపాడు, పైనంపల్లి, బీరోలు, జల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ‘కెరీర్ గైడెన్స్’, విత్తన బంతుల ప్రాముఖ్యతపై మోటివేషన్ సదస్సులు నిర్వహించి, విద్యార్థులతోనే ప్రత్యక్షంగా సీడ్ బాల్స్ తయారు చేయించారు. తేట్టెలపాడు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు 300 సీడ్ బాల్స్ తయారు చేయగా, పైనంపల్లి హెచ్ఎం పార్థసారథి నేతృత్వంలో 250 సీడ్ బాల్స్ తయారు చేయించి ‘అమ్మ పేరు మీద మొక్క నాటడం’ అంశంపై అవగాహన కల్పించారు. అలాగే బీరోలు హెచ్ఎం వీరాస్వామి ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు, జల్లపల్లి పీఎం శ్రీ స్కూల్ హెచ్ఎం పార్థసారథి పర్యవేక్షణలో 300 మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఒత్తిడిని జయించి సమాజంలో ఎలా రాణించాలనే అంశాలపై ప్రత్యేక మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సర్పంచ్లకు, మహిళలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


