ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
మరిపెడ: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూగులోతు రవి నాయక్ అధ్యక్షతన మరిపెడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ శ్రీ రామసహాయం సురేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. మరిపెడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నూతన సివిల్ కోర్టును మంజూరు చేయించడంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కృషి ఎంతో కీలకమని అన్నారు. కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.
సురేందర్ రెడ్డి సహకారంతో, తన నాయకత్వంలో మరిపెడ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





