బార్–బెంచ్ సమన్వయంతో ప్రజలకు సత్వర న్యాయం అందించాలి.
న్యాయమూర్తులు ఈవీ వేణుగోపాల్,ఎన్.రాజేశ్వరరావు,బీఆర్.మధుసూదనరావు.
డోర్నకల్–మరిపెడ ప్రతినిధి,సెప్టెంబర్ 19(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి,జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థాన భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్,జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు,జస్టిస్ బీఆర్.మధుసూదనరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా న్యాయస్థానం ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మాట్లాడుతూ,న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం తీసుకురావడం అందరి బాధ్యత అన్నారు. న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి బార్–బెంచ్ మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి న్యాయవాది న్యాయస్థానానికి సహకరిస్తూ చట్టపరమైన అంశాలను సమగ్రంగా కోర్టు ముందుంచాలని సూచించారు.
న్యాయమూర్తులు ప్రతి కేసును శ్రద్ధగా పరిశీలించి,చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.న్యాయవాదులు కూడా న్యాయస్థాన నిర్ణయాలను విస్తృత దృక్పథంతో అర్థం చేసుకోవడంతో పాటు నిరంతర అధ్యయనం,ఆత్మపరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.తాను న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎదురైన ఒక కేసు అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలి.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు,న్యాయపరమైన రక్షణలు అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ,బార్,కార్యనిర్వాహక వ్యవస్థతో పాటు ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. రాజ్యాంగంలోని 14,19,21 అధికరణాలతో పాటు 51ఏ అధికరణ స్ఫూర్తిని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.సమాజంలోని బలహీన వర్గాలు,ఆశ్రయ గృహాల్లోని పిల్లలు,అవసరమైన ఇతర వర్గాలకు చట్టపరమైన రక్షణ,సంక్షేమ సేవలు అందేలా న్యాయవ్యవస్థ,కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
న్యాయస్థాన మౌలిక వసతులకు ప్రాధాన్యం
న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన కోర్టు భవనాలు,సిబ్బంది,సాంకేతిక సదుపాయాలు,ఇతర మౌలిక వసతులు అవసరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా న్యాయస్థాన మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
త్వరలో మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన
వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కోర్టు భవనం అవసరం ఉందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనానికి త్వరలో ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఇందుకు జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ,న్యాయవ్యవస్థకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ న్యాయస్థాన మౌలిక వసతుల అభివృద్ధి,ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చూపుతున్న చొరవను న్యాయమూర్తి అభినందించారు. మరిపెడ న్యాయస్థానం ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు అధికారులు,ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డీకే మురళీమోహన్,ఇతర న్యాయమూర్తులు,న్యాయస్థాన సిబ్బంది,బార్ అసోసియేషన్ ప్రతినిధులు,న్యాయవాదులు,సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు,జస్టిస్ బీఆర్.మధుసూదనరావు మాట్లాడుతూ,మహబూబాబాద్ జిల్లాలో నూతన న్యాయస్థానం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందేలా న్యాయస్థానం పనిచేయాలని ఆకాంక్షించారు. మరిపెడ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ,తమ స్వంత జిల్లాల్లో పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో హైకోర్టు న్యాయమూర్తులకు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డీకే మురళీమోహన్,సీనియర్,జూనియర్ న్యాయమూర్తులు శాలిని షాకెల్లి,స్వాతి మురారి, కృష్ణతేజ్, ధీరజ్ కుమార్,జీవన్ కుమార్,మహతి వైష్ణవి, అఖిల, దిలీప్ కుమార్ నాయక్,సూర్య చంద్రకళ,క్యాన్ లాల్, చండే శ్రీదేవి, జ్యోత్స్న తదితర న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,ఎస్పీ డాక్టర్ శబరిష్, వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు,సీనియర్ న్యాయవాదులు,న్యాయస్థాన సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు..



