కల్తీ మద్యం, కల్తీ కల్లును అరికట్టాలి.. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రామన్నపేట, సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్):
రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఏడుకొండలు, ఎస్సై అరుణ్ కుమార్‌లను గీత పనివారల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్, సొసైటీ ఉపాధ్యక్షులు, గీత పనివారల మండల నాయకులు లగ్గోని యాదయ్య తదితరులు అధికారులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గీత పనివారల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కల్లుగీత సహకార సంఘాల సొసైటీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎక్స్‌గ్రేషియా, పెన్షన్‌తో పాటు ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బెల్ట్ షాపులను నియంత్రించడంతో పాటు కల్తీ మద్యం, కల్తీ కల్లును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ, ఎస్సైలను విజ్ఞప్తి చేశారు.
సంఘం నాయకుల విజ్ఞప్తిపై సీఐ ఏడుకొండలు స్పందిస్తూ.. కల్తీ మద్యం, కల్తీ కల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. గీత కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, సీనియర్ నాయకులు గంగాపురం యాదయ్య, సొసైటీ సభ్యులు చెరుకు శివరాజ్, నోముల వెంకటేశం, భూపతి నరసింహ, చెరుకు సత్యనారాయణ, వీరమల్ల లక్ష్మీనారాయణ, బండారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


