పోషకాహారం, పరిశుభ్రతతో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
అంగన్వాడీ టీచర్ గుగ్గిళ్ల అమృత.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 12(నమస్తే న్యూస్).
కిశోర బాలికలు తమ ఆరోగ్యం,పోషకాహారం,వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ టీచర్ గుగ్గిళ్ల అమృత సూచించారు.మరిపెడ మండలం బురహాన్పురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో కిశోర బాలికల కోసం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలికలకు పౌష్టికాహారం ప్రాధాన్యత,రక్తహీనత నివారణ,ఆరోగ్య పరిరక్షణ,వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు రక్తహీనత వంటి సమస్యలను నివారించుకోవచ్చని వివరించారు.అలాగే ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు.
కిశోర దశలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని,ఈ సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు,అంగన్వాడీ సిబ్బంది,ఆశా కార్యకర్తల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గుగ్గిళ్ల అమృత,బి.శాంత,వెంకటరమణ,ఆశా వర్కర్,కిశోర బాలికలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

