సరైన పత్రాలు లేని 2 కార్లు, 2 బైక్‌లు సీజ్
500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 20 లీటర్ల నాటుసారా స్వాధీనం
మరిపెడ, సెప్టెంబర్ 12 (నమస్తే న్యూస్):
జిల్లా ఎస్పీ డాక్టర్ శభరీష్ పి. ఐపీఎస్ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ ఎల్. పవన్‌కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ సర్కిల్ పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గుర్రప్పతండా, లచ్చతండా, తండా ధర్మారం గ్రామాల్లో అనుమానాస్పద ఇళ్లు, వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాకు సంబంధించిన 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నాటుసారా తయారీకి పాల్పడుతున్న బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.కార్డన్ అండ్ సెర్చ్ అనంతరం గ్రామస్తులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ మైబూబీ, సీరోల్ ఎస్ఐ సంతోష్, చిన్నగూడూరు ఎస్ఐ కుశకుమార్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డితో పాటు సుమారు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

