శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సోషల్ మీడియా పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి:తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్
మరిపెడ, సెప్టెంబర్ 11 (నమస్తే న్యూస్)
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన శాంతి సమావేశంలో డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడారు. పండుగల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ ఇతర మతాల మనోభావాలను గౌరవించాలని కోరారు. చిన్నపాటి అపోహలు, వివాదాలకు దారితీయకుండా పరస్పర సామరస్యంతో వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే, నేరపూరిత సందేశాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మెసేజ్లు కనిపిస్తే వాటిని ఫార్వర్డ్ చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పండుగల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. ఈ సమావేశంలో మరిపెడ సీఐ పవన్ కుమార్, ఎస్సైలు గండ్రాతి సతీష్, మహబూబి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


