తిరుమలాయపాలెం సెప్టెంబర్ 10 (నమస్తే న్యూస్)
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. హస్నాబాద్ లో కొవ్వూరి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ పై హేయమైన వ్యాఖ్యలు చేయడం తగదని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే ప్రజాజీవితంలో ఉన్న నాయకులు మాటతీరు, భాష విషయంలో సంయమనం పాటించాలని అన్నారు. హైదరాబాద్ లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని, అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగ విలువలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపైనా ఉందని గుర్తు చేశారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొవ్వూరి సత్తిరెడ్డి, వార్డు సభ్యులు మోటపోతుల శ్రీనివాస్, పల్లి గోపి, మోటపోతుల చిన్న శ్రీను, సీనియర్ నాయకులు పల్లి నాగేశ్వరరావు, యువ నాయకులు పసలాది రవి, పల్లి నవీన్ తో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

