మస్టర్ల పరిశీలన.. కూలీలతో నేరుగా మాట్లాడిన ఎంపీడీవో రాంప్రసాద్
నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ఫారం పాండ్లు కీలకం
నర్సింహులపేట,సెప్టెంబర్ 10 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రం తండా గ్రామపంచాయతీలో చేపడుతున్న VB-G RAM-G పనుల్లో భాగంగా ఫారం పాండ్ నిర్మాణ పనులను ఎంపీడీవో రాంప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించిన ఎంపీడీవో.. పనులకు సంబంధించిన మస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం కూలీలతో నేరుగా మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరు, పనుల అమలు తీరు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు.రైతుల పొలాల్లో ఫారం పాండ్ల ఏర్పాటు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతో నీటి సంరక్షణకు, భూగర్భ జలాల పెంపునకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో నీటి లభ్యత పెంచేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఎంపీడీవో సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.


