అన్యాయాన్ని ప్రశ్నించడమే ఆయనకు నిజమైన నివాళి
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 09(నమస్తే న్యూస్).
మండల కేంద్రంలోని ఎస్బీఐ కాలనీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ..కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడి,అన్యాయాన్ని ప్రశ్నించిన గొప్ప ప్రజాకవి అని అన్నారు.పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ,ప్రజల హక్కుల కోసం తన కలంతో నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.కాళోజీ సాహిత్యంలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని గుర్తుచేస్తూ ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించాలని,పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు.పేదలు,కార్మికులు,రైతులు,అణగారిన వర్గాల సమస్యలపై కాళోజీ చూపిన చైతన్య స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడం,అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే కాళోజీకి నిజమైన నివాళి అని అబ్దుల్ రషీద్ అన్నారు.ఈ కార్యక్రమంలో సత్యం,సోహెల్,సోమన్న,వెంకన్న,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

