రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్)
తెలంగాణ భాషా దినోత్సవం కేవలం ఒక జయంతి కార్యక్రమంగా కాకుండా,
తెలంగాణ భాషా వారసత్వాన్ని తరువాతి తరాలకు పరిచయం చేయాలి –
ఖమ్మం జిల్లా
అకడమిక్ మానిటరింగ్ అధికారి
పెసర ప్రభాకర్ రెడ్డి
అర్ధవంతంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
కాళోజీ సాహిత్యం, తెలంగాణ భాషా వైభవాన్ని చాటిన విద్యార్థుల ప్రతిభ
తిరుమలాయపాలెం: ప్రజాకవి, తెలంగాణ తొలి పొద్దు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలాయపాలెంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి. విజయ్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీ పెసర ప్రభాకర్ రెడ్డి, FLN జిల్లా బృంద సభ్యులు శ్యామలాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలను, ఆయన సాహిత్య కృషిని విద్యార్థులకు పరిచయం చేశారు. 1914 సెప్టెంబర్ 9న వరంగల్ ప్రాంతంలోని మడికొండలో జన్మించిన కాళోజీ, తెలంగాణ ప్రజల జీవనానుభవాలు, వారి భాష, యాస, సంస్కృతి, సామాజిక సమస్యలను తన రచనల్లో ప్రతిబింబించిన ప్రజాకవి. స్వాతంత్ర్యోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ వంటి అనేక ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు.
కాళోజీకి సాహిత్యం కేవలం రచనా ప్రక్రియ మాత్రమే కాదు; ప్రజల గొంతుకగా నిలిచే సామాజిక బాధ్యత. సామాన్యుడి జీవితాన్ని, అతని బాధను, ఆశను, ఆవేదనను తన కవిత్వంలో సరళమైన ప్రజల భాషలో వ్యక్తీకరించారు. తెలంగాణ మాండలికాన్ని తక్కువగా చూడకుండా, దాని సహజత్వాన్ని, జీవన సౌందర్యాన్ని సాహిత్యంలో నిలబెట్టిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. ఆయన రచనలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భాషా అస్తిత్వానికి బలమైన స్వరంగా నిలిచాయి. ఆయన సాహిత్య సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
కాళోజీ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో తెలుగు భాషా పాటవ పోటీలు నిర్వహించారు. తెలుగు భాషా ఉపాధ్యాయులు బి. హనుమంతు, గోపమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కాళోజీ కవితల పఠనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కాళోజీ రచనలను, తెలంగాణ భాష ప్రత్యేకతను, మాతృభాష ప్రాధాన్యతను తమ ప్రసంగాలు, వ్యాసాలు, కవితా పఠనం ద్వారా చక్కగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాఒకరు అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో భాషా సామర్థ్యం అభివృద్ధి చెందినప్పుడే ఇతర అన్ని విషయాల్లోనూ మెరుగైన అభ్యసన సాధ్యమవుతుందని అన్నారు. భాష అనేది కేవలం సమాచార మార్పిడి సాధనం కాదని, అది ఒక సమాజపు సంస్కృతి, చరిత్ర, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ భాషను, యాసను, స్థానిక పదజాలాన్ని పరిరక్షించుకోవడం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో కీలకమని అన్నారు. ఈ క్రమంలో కాళోజీ చేసిన సాహిత్య, సామాజిక సేవలను ఆయన కొనియాడారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. విజయ కుమారి మాట్లాడుతూ, విద్యార్థుల్లో పాఠ్యాంశ పరిజ్ఞానంతో పాటు సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, వ్యక్తీకరణ సామర్థ్యాలను పెంపొందించడమే పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల ప్రగతిని సమగ్రంగా అంచనా వేసే LIP (Learning Improvement Programme) విధానానికి అనుగుణంగా ఈ పోటీలను నిర్వహించామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను తమ ప్రతిభ ద్వారా ప్రదర్శించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
కాళోజీ చూపిన మార్గంలో ప్రజల భాషకు గౌరవం ఇవ్వడం, మాతృభాషను ప్రేమించడం, సామాజిక బాధ్యతతో ఆలోచించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం వంటి విలువలను విద్యార్థులు అలవరచుకోవాలని కార్యక్రమంలో వక్తలు సూచించారు. తెలంగాణ భాషా దినోత్సవం కేవలం ఒక జయంతి కార్యక్రమంగా కాకుండా, తెలంగాణ భాషా వారసత్వాన్ని తరువాతి తరాలకు పరిచయం చేసే సందర్భంగా మారాలని ఆకాంక్షించారు.
అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థుల ఉత్సాహం, పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, ఏ.వి. నాగేశ్వరరావు, చంద్ర ప్రసాద్, కట్టా శ్రీనివాస్, శ్యామ్, సంతోష్, బాబురావు, ఉమాదేవి, విజయలక్ష్మి, శేషపణి, శోభన, కృష్ణకళ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

