- విద్యార్థులకు ప్రీ-వొకేషనల్ విద్యపై అవగాహన.. లక్ష్య సాధనకు ఏకాగ్రతతో కృషి చేయాలి
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్ )
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, విద్యార్థులు భవిష్యత్తులో వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ కామన్ ఫార్మర్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మగాని నరసింహారావు సూచించారు. బుధవారం జల్లేపల్లి, బీరోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ‘వ్యవసాయంలో ప్రీ-వొకేషనల్ విద్య మార్గదర్శకాలు’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్‌గా పాల్గొన్న నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే వ్యవసాయంపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. నేల, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నీటి యాజమాన్యంపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సేంద్రియ ఎరువులు, వర్మీకంపోస్టు, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. తాను మెట్ట ప్రాంతంలో టమాట పంట సాగు చేసి అధిక దిగుబడి సాధించిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వ్యవసాయ విద్యను అభ్యసించి నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని కోరారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
రిటైర్డ్ ఎండీఓ ఎం.డి. నవాబ్ పాషా కెరీర్ గైడెన్స్, టైమ్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, యాంటీ నార్కోటిక్ అవేర్నెస్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ముందుగా తమ ఆసక్తిని గుర్తించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
పదో తరగతి అనంతరం ఉన్నత విద్య, వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన నిరాశ చెందకుండా, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
కాళోజీకి నివాళి
తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధారా రాజేష్ పుష్పమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థినుల తెలంగాణ పాటకు నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రధానోపాధ్యాయుడు ధారా రాజేష్ మాట్లాడుతూ.. నరసింహారావు అందించిన వ్యవసాయ మార్గదర్శకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు కూడా తెలియజేసి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించవచ్చన్నారు. నవాబ్ పాషా కెరీర్ గైడెన్స్ విద్యార్థులకు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


