ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు
నర్సింహులపేట,సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్)
యువత కాళోజి ఆశయ సాధనకు కృషి చేయాలని నరసింహుల పేట సర్పంచ్ పెదమాములయ పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని, ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటిన కాళోజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాస యాకయ్య, పంచాయతీ సెక్రటరీ అశోక్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

