తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
డోర్నకల్, ఆగస్టు 9 (నమస్తే న్యూస్):
ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి సమస్యలు, హక్కులను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన కాళోజీ సేవలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని తహసీల్దార్ రాఘవరెడ్డి పేర్కొన్నారు.ప్రజల పక్షాన నిలబడి తన కలంతో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన మహనీయుడిగా కాళోజీ నారాయణరావు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. తెలంగాణ భాష ప్రత్యేకతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.మాతృభాషను గౌరవిస్తూ తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

