మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి
రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, లౌడ్స్పీకర్లకు అనుమతి లేదు
మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్
మరిపెడ మండల ప్రజలందరికీ ఎస్ఐ గండ్రాతి సతీష్ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మరిపెడ పోలీస్ స్టేషన్లో మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా మరిపెడ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
విద్యుత్, అగ్నిప్రమాదాల విషయంలో జాగ్రత్తలు
మండపాల వద్ద విద్యుత్ వైర్లు వేలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండేలా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండపం వద్ద ఇసుక లేదా నీటితో కూడిన అగ్నిమాపక బకెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
డీజేలు, లౌడ్‌స్పీకర్లపై నిబంధనలు
అధిక శబ్దంతో డీజేలు, లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు, డీజేలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఉత్సవాల సందర్భంగా మద్యం సేవించి గొడవలకు పాల్పడడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దొంగతనాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్ఐ తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మట్టి గణపతులను ప్రతిష్టించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు. చెరువులు కలుషితం కాకుండా పర్యావరణహిత రంగులను వినియోగించాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తప్పనిసరి
వినాయక నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్లు, డీసీఎంలపై ప్రమాదకరంగా కూర్చోవడం, వాహనాలపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం వంటివి చేయరాదన్నారు. పోలీస్ శాఖ సూచించిన మార్గంలోనే నిమజ్జన ఊరేగింపు నిర్వహించాలని తెలిపారు. చెరువుల వద్ద లోతైన ప్రదేశాల్లోకి వెళ్లవద్దని, ఈత రాని వారు నీటిలోకి దిగరాదని సూచించారు.
నిమజ్జనం రోజున మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గొడవలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సతీష్ కోరారు.మండలంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా గొడవ లేదా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే డయల్ 100కు లేదా మరిపెడ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ఐ గండ్రాతి సతీష్ కోరారు.



