ట్రి గార్డులు లేక పశువుల పాలైన మొక్కలు.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో వనమహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నాటిన మొక్కలకు సరైన సంరక్షణ లేకపోవడంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. వాటిని సంరక్షించడంలో మాత్రం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేయాల్సిన ట్రీ గార్డులు అందుబాటులో లేకపోవడంతో పశువులు మొక్కలను మేయడంతో పలుమొక్కలు దెబ్బతిన్నాయని, మరికొన్ని కనిపించకుండా పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొక్కలు నాటడం మాత్రమే కాదు.. వాటిని పెంచే బాధ్యత కూడా అధికారులదేనని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోకపోతే వనమహోత్సవం లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు.ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోనే నాటిన మొక్కలకు ఈ పరిస్థితి ఉంటే.. గ్రామపంచాయతీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి, పర్యావరణ కార్యక్రమాల పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా నీరు పోస్తూ సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

