స్క్రాప్‌కు ముందు ఆర్టీఏకు సమాచారం ఇవ్వాలి:
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా: వాహనాలను స్క్రాప్ (తుక్కు) కింద విక్రయించే యజమానులు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా బస్సులు, లారీలు, ఇతర వాణిజ్య వాహనాలను స్క్రాప్‌కు విక్రయించే ముందు ఆర్టీఏ అధికారులకు సరైన సమాచారం అందించాలని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గుర్తుచేశారు.
జిల్లాలో పన్ను బకాయిలున్న వాహనాల యజమానులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో కొందరు యజమానులు తమ వాహనాలను ఇప్పటికే తుక్కుగా విక్రయించామని చెబుతున్నారని తెలిపారు. అయితే వాహనాన్ని స్క్రాప్‌కు అమ్మినంత మాత్రాన దానిపై ఉన్న పన్ను బకాయి రద్దు కాదని స్పష్టం చేశారు.
పన్నులు చెల్లించకుండా వాహనాన్ని స్క్రాప్‌కు విక్రయిస్తే, ఆ బకాయి యజమాని పేరుపై కొనసాగుతుందని చెప్పారు. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వాహనాన్ని స్క్రాప్‌కు విక్రయించే ముందే పన్ను బకాయిలను నిబంధనల ప్రకారం చెల్లించి, ఆర్టీఏ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
పన్నులు చెల్లించని వాహన యజమానులు మీసేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో పన్నులు చెల్లించుకోవచ్చని తెలిపారు. అనవసరమైన పెనాల్టీలకు గురికాకుండా పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు.
మోటార్ వెహికల్స్ యాక్ట్–1988లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాల రిజిస్ట్రేషన్‌పై రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. వాహన యజమానులు రవాణా శాఖ నిబంధనలు పాటిస్తూ పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.

