విద్యుత్‌నూ అనధికారంగా వాడుతున్నారని ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు వినతి
నర్సింహులపేట, సెప్టెంబర్ 7 (నమస్తే న్యూస్)
ప్రభుత్వ ప్రజావసరాల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి వనరులను కొందరు వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు నర్సింహులపేట మండలంలో కలకలం రేపుతున్నాయి. గ్రామానికి తాగునీరు అందించాల్సిన ప్రభుత్వ మంచినీటి బావి నీటిని ఓ వ్యక్తి తన వ్యవసాయ పొలానికి అక్రమంగా మళ్లించుకుంటున్నారని పేర్కొంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నర్సింహులపేటలోని సింగరిమత్త బావి, కంకమేశ్వర స్వామి ఆలయం సమీపం నుంచి ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లోని వాటర్ సంపులోకి పైపులైన్ ద్వారా నీటిని తరలించే వ్యవస్థ ఉంది. మిషన్ భగీరథకు అనుసంధానమైన ఈ మంచినీటి బావి నీటిని గ్రామానికి చెందిన జనుకుల రమేష్ తన వ్యవసాయ భూమికి మళ్లించేందుకు పైపులను కట్ చేసి, గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు.అంతేకాక గ్రామపంచాయతీ నుంచి ఏర్పాటు చేసిన విద్యుత్‌ను కూడా అనధికారంగా వినియోగిస్తున్నారని, విద్యుత్ బిల్లులు మాత్రం మరో వ్యక్తి పేరుతో చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రజల దాహం తీర్చాల్సిన నీరు పొలాలకు.. ఇదేనా అధికారుల పర్యవేక్షణ? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వనరులు ప్రజల కోసం ఏర్పాటు చేసినవే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ వనరుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ మంచినీటి వనరుల దుర్వినియోగం, విద్యుత్ అక్రమ వినియోగంపై వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిజానిజాలను తేల్చి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు ఎంపీడీవోను కోరారు.




