ఉద్యోగ నిరీక్షణతో యువత సహనం కోల్పోతుంది.
జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 07 (నమస్తే న్యూస్).
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర జాప్యం,వైఫల్యం జరుగుతోందని భారత రాష్ట్ర సమితి నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆరోపించారు.మరిపెడ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సోమవారం మండల స్థాయి గ్రీవెన్స్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలపై స్పష్టత లేకపోవడం, పలు హామీలు అమలుకు నోచుకోకపోవడం వల్ల వివిధ వర్గాల ప్రజలు నిరాశ చెందుతున్నారని అందులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, చేనేత, పేదలు తదితర అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదన్నారు. ఇటీవల అతివృష్టి వల్ల మరిపెడ మండలం నష్టపోయిందని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సహాయ చర్యలు చేపట్టాలని, ఉద్యోగ నిరీక్షణతో యువత సహనం కోల్పోతున్నారని, స్పష్టమైన ఉపాధి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత సర్పంచులు, మాజి సర్పంచులు, వార్డు నెంబర్లు, బీ ఆర్ ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


