అనుమతి లేని మండపాలకు పర్మిషన్ అనుమతించబడదు.
మట్టి గణపతులనే పెట్టండి.చెరువులను కాపాడండి.
రాత్రి 10 తర్వాత డీజేలకు బ్రేక్,నిబంధనలు అతిక్రమిస్తే కేసులే.
మరిపెడ పోలీసు ఎస్ ఐ గండ్రాతి సత్తిష్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 06(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ప్రజలందరికీ మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు.శనివారం మరిపెడ పోలీస్ స్టేషన్ లో మండల వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పాటించాల్సిన నియమ నిబంధనలు:
మండపాల అనుమతులు: ప్రతి గ్రామంలో,ప్రతి కాలనీలో వినాయక మండపం ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగా మరిపెడ పోలీస్ స్టేషన్ కు వచ్చి అనుమతి పత్రం తీసుకోవాలి.అనుమతి లేని మండపాలను అనుమతించబోము.రోడ్లపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలి.
విద్యుత్ మరియు భద్రత: మండపాల దగ్గర విద్యుత్ వైర్లు వేలాడకుండా జాగ్రత్త వహించాలి.చిన్న పిల్లలు వైర్లను ముట్టుకోకుండా చూడాలి.ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా ఇసుక/నీటితో కూడిన అగ్నిమాపక బకెట్ ఉంచాలి.వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
శబ్ద కాలుష్యం: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత డీజేలు,లౌడ్ స్పీకర్లు కట్టివేయాలి.అధిక శబ్దంతో వృద్ధులు,చిన్న పిల్లలకు ఇబ్బంది కలిగించరాదు.నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.
శాంతి భద్రతలు: ఉత్సవాల పేరుతో మద్యం సేవించి గొడవలు పడితే,రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.మహిళలు,చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా,దొంగతనాలు చేసినా ఉపేక్షించేది లేదు.
పర్యావరణ పరిరక్షణ:దయచేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలను వాడవద్దు.మన చెరువులను కాపాడేందుకు మట్టి గణపతులనే ప్రతిష్టించండి.కెమికల్స్ లేని రంగులు వాడండి.
నిమజ్జనం రోజు నియమాలు: నిమజ్జన ఊరేగింపులో వాహనాలపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం,ట్రాక్టర్లు,డీసీఎంలపై ప్రమాదకరంగా కూర్చోవడం చేయవద్దు.పోలీసులు కేటాయించిన రూట్ లోనే వెళ్లాలి.చెరువుల వద్ద లోతు ప్రదేశాల్లోకి వెళ్లవద్దు.ఈత రాని వారు నీళ్లలోకి దిగవద్దు.నిమజ్జనం రోజున మద్యం సేవించి వాహనాలు నడపరాదు.ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా,ఏదైనా గొడవ జరిగినా వెంటనే డయల్ 100 కు లేదా మరిపెడ ఎస్ఐ సతీష్ కి,పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.ఇట్లు,ఎస్.ఐ.గండ్రాతి సతీష్,మరిపెడ పోలీస్ స్టేషన్.


