మైనర్లతో ట్రాక్టర్ల నడుపుతున్నారంటూ ఆరోపణలు
అధికారుల నిఘా ఎక్కడ..? చర్యలు ఎప్పుడు..?
చిన్నగూడూరు, సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల పరిధిలోని ఆకేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.స్థానికుల సమాచారం ప్రకారం.. పగటి వేళలతో పోలిస్తే రాత్రి సమయంలో ఇసుక తవ్వకాలు, రవాణా మరింత పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాగు పరిసరాల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని చెబుతున్నారు. వరుసగా ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తున్నా పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇసుక రవాణా చేస్తున్న కొన్ని ట్రాక్టర్లను మైనర్లు నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనర్లతో వాహనాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరుతున్నారు.ఆకేరు వాగు పరిసరాల్లో ఇసుక తవ్వకాలు, రాత్రివేళల్లో ట్రాక్టర్ల రాకపోకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల నిఘాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
ఉన్నతాధికారులు దృష్టి సారించేనా?
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రివేళల్లో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ తవ్వకాలు నిజమేనా..? మైనర్లతో డ్రైవింగ్ జరుగుతోందా..? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.ఆకేరు వాగులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమేనా..?రాత్రివేళల్లో ట్రాక్టర్లకు అంత స్వేచ్ఛ ఎలా లభిస్తోంది..?మైనర్లతో డ్రైవింగ్ జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..?అక్రమ ఇసుక రవాణాపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

