మా అమ్మను అవమానించడం బాధించింది.. ఆమెను ఎలా బలి చేస్తారు?
కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్):
మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి వన్ టైమ్ జెడ్పీటీసీ, వన్ టైమ్ ఎమ్మెల్సీ, వన్ టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎంపీ అంటూ సుస్మిత వ్యాఖ్యానించారు. తన తల్లి కొండా సురేఖ ప్రజల చేత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తల్లిని రేవంత్ రెడ్డి అవమానించడం బాధాకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. బీసీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని సుస్మిత ఆరోపించారు.తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశారు.గతంలో బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని సుస్మిత గుర్తుచేశారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, “నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు?” అని ఆమె ప్రశ్నించారు.ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మరో వ్యక్తిని బాధ్యుడిని చేసి చర్యలు తీసుకోవడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించిన సుస్మిత.. తన తల్లిని అవమానించడం, ఆమెపై చర్యలు తీసుకోవడం తీవ్రంగా బాధించిందని తెలిపారు.

