జయపురం శివారులో అక్రమ ఇసుక తరలింపుపై పోలీసుల కేసు నమోదు
అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు: నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న

నర్సింహులపేట,సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ శివారులో ఆకేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు ట్రాక్టర్ యజమానిపై నర్సింహులపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక లోడ్‌తో ఉన్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.ఈ సందర్భంగా నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న మాట్లాడుతూ.. “అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తాం. ఇసుక దందాకు అడ్డుకట్ట వేసే విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక తరలించే వారు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఎస్సై బానోత్ వెంకన్న స్పష్టం చేశారు.
