మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బీఆర్ఎస్ శంఖారావం.
33 నెలలు,1000 రోజుల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చని దగా ప్రభుత్వం.
మాజీ మంత్రి డి.ఎస్.రెడ్యానాయక్ ధ్వజం.

డోర్నకల్/మరిపెడ:సెప్టెంబర్ 04(నమస్తే న్యూస్).
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనను ఎండగడుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఖమ్మం – వరంగల్ ప్రధాన రహదారిపై శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా,వంటా వార్పు కార్యక్రమం హోరెత్తింది.రోడ్డుపై పొయ్యిలు పెట్టి మహిళలు వంట చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు.దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి డి.ఎస్.రెడ్యానాయక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 33 నెలలు,1000 రోజులు గడిచినా కాంగ్రెస్ సర్కార్ ఒక్క గ్యారెంటీని కూడా సరిగ్గా అమలు చేయలేదు.ఇది ప్రజల ప్రభుత్వం కాదు,ప్రజలను నిలువునా మోసం చేసిన దగా ప్రభుత్వం అని మండిపడ్డారు.
అన్ని వర్గాలను మోసం చేసింది:
ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఖాతాలో పైసా వేయలేదు.ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.వృద్ధులకు,బీడీ కార్మికులకు రూ.4000 పెన్షన్ అని,దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ అని ఊరించి ఇప్పుడు వారిని రోడ్డున పడేశారు.కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ కింద తులం బంగారం ఎక్కడ? ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో పేద తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు,రైతులు,నిరుద్యోగులకు తీరని అన్యాయం:
విద్యార్థినులకు స్కూటీ ఇస్తామన్నారు,ఏమైంది? విద్యా భరోసా కార్డు ఎక్కడ? ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.12 వేల కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు.రైతు భరోసా లేదు,రైతు రుణమాఫీ లేదు,వరి పంటకు రూ.500 బోనస్ లేదు.అన్నదాతను పూర్తిగా మోసం చేశారు.రైతు కూలీలకు ఉపాధి హామీ కింద ఏడాదికి రూ.12,000 ఇస్తామన్న హామీ గాలికి వదిలేశారు అని దుయ్యబట్టారు.
నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు,2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు – ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 అన్న హామీ కూడా బోగస్ అయింది.అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.1000 రోజుల్లో అభివృద్ధి శూన్యం,హామీల అమలు శూన్యం అని రెడ్యానాయక్ ఎండగట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు,మహిళా విభాగం నాయకులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,రైతులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు…



