హాస్టల్ నుంచి బయలుదేరి.. స్కూల్కు చేరని నలుగురు బాలురు

నర్సింహులపేట, సెప్టెంబర్ 3 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ స్థానిక మోడల్ స్కూల్లో చదువుతున్న నలుగురు బాలురు అదృశ్యమైనట్లు సమాచారం. నిన్న ఉదయం వసతి గృహం నుంచి పాఠశాలకు బయలుదేరిన బాలురు స్కూల్లోకి ప్రవేశించకపోవడం ఆందోళనకు కారణమైంది.బాలురు పాఠశాలకు హాజరు కాలేదని ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వచ్చినప్పటికీ, విషయం తీవ్రంగా పరిగణించకుండా తల్లిదండ్రులకు సమాచారం అందించడానికే పరిమితమైనట్లు సమాచారం. బాలురు ఎక్కడికి వెళ్లారు? పాఠశాలకు రాకపోవడానికి కారణమేంటి? అనే విషయాలపై వెంటనే ఆరా తీసి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గురువారం రోజున బాలుర తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలుర ఆచూకీ కోసం విచారణ చేపట్టినట్లు సమాచారం.
సిగరెట్ బాక్స్ విషయమై మందలింపా?
వసతి గృహంలో విచారణ చేయగా, బాలుర వద్ద సిగరెట్ బాక్స్ ఉండటంతో హాస్టల్ వార్డెన్ వారిని మందలించినట్లు తెలిసింది. ఈ ఘటన అనంతరం బాలురు హాస్టల్ నుంచి వెళ్లిపోయారా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. అయితే బాలురు ఎందుకు వెళ్లారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.తీర్థయాత్రకు వెళ్లినట్లు సహచరుల సమాచారం
వసతి గృహంలో బాలుర సహచరులను విచారించగా, వారు తీర్థయాత్రకు వెళ్లినట్లు, ముఖ్యంగా తిరుపతి లేదా యాదగిరిగుట్టకు వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. బాలుర ఆచూకీపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.సిబ్బంది పర్యవేక్షణపై ప్రశ్నలు వసతి గృహంలో ఉండే విద్యార్థుల కదలికలను వార్డెన్ నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, నలుగురు బాలురు బయటకు వెళ్లిన విషయం వెంటనే గుర్తించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, పాఠశాలలోకి బాలురు రాకపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే పాఠశాల యాజమాన్యం బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే పరిస్థితి మరింత త్వరగా వెలుగులోకి వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలుర ఆచూకీ కోసం తల్లిదండ్రులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ బాలుర ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
