నలుగురు అరెస్ట్.. మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 4 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బర్త్, డెత్ సర్టిఫికెట్లను అక్రమంగా జారీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సీఐ రవీందర్ వివరాలు వెల్లడించారు.
గ్రామపంచాయతీ అధికారి కె. చంద్రమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఫిర్యాదులో భాగంగా 200 బర్త్ సర్టిఫికెట్లు, 19 డెత్ సర్టిఫికెట్లు అక్రమంగా జారీ చేసినట్లు పేర్కొన్నారని తెలిపారు.
పంచాయతీ సెక్రటరీల డిజిటల్ సిగ్నేచర్ కీస్‌ను అక్రమంగా ఉపయోగించి ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దర్యాప్తులో బయ్యారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న కుంజా ప్రతాప్ పంచాయతీ సెక్రటరీల డిజిటల్ సిగ్నేచర్ కీస్‌ను అక్రమంగా ఉపయోగించి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు.
ఈ వ్యవహారంలో సర్టిఫికెట్ల జారీకి సహకరించిన మహబూబాబాద్‌కు చెందిన చెవిటి సతీష్, షేక్ అలీమ్, కోట సుధాకర్‌లను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా తప్పుడు పద్ధతుల్లో డెత్ సర్టిఫికెట్లు పొంది వాటిని ఇతర అవసరాలకు వినియోగించుకున్న వ్యక్తులను కూడా గుర్తించి, త్వరలో అరెస్టు చేస్తామని సీఐ రవీందర్ తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

