విత్తన, ఎరువుల డీలర్లకు అవగాహన వర్క్‌షాప్
బయ్యారం, సెప్టెంబర్ 4 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాజు ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి (DAO) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా Seed Sales Appలో ప్రభుత్వం సూచించిన ప్రాధాన్యత కలిగిన వరి రకాల వివరాల నవీకరణ (Updation) స్థితిని అధికారులు సమీక్షించారు. అలాగే నూతనంగా అమల్లోకి వచ్చిన FFS (Framework for Fertilizer Sale) App వినియోగంపై డీలర్లకు అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చారు.
వరి రకాల వివరాలకు సంబంధించిన డేటా నవీకరణ ప్రక్రియను డీలర్లు వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ డేటా నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ విత్తనాలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

