శిరీష మృతికి కారణమైన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి
ఇల్లందులో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: ఇల్లందు
ఇల్లందు, సెప్టెంబర్ 4 (నమస్తే న్యూస్): ఊకె శిరీష మృతికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్లోని కొమరం భీమ్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ చైర్మన్, ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగరిక సమాజంలో ఆదివాసులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఆదివాసీలకు న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. శిరీష మృతికి కారణమైన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి చెందిన సమాజానికి చెందిన వ్యక్తికి ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వాలు వెంటనే స్పందించేవని, మారుమూల ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వస్తున్న ఆదివాసీల విషయంలో మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పందించి శిరీష మృతికి కారణమైన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శిరీష మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకునే వరకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమం కొనసాగిస్తారని పూనెం శ్రీనివాస్ తెలిపారు. ఆదివాసీ యువతకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు సనప గోవర్ధన్, మండల అధ్యక్షుడు చింత ఉపేందర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఊకె చైతన్య, కిన్నెర కిషోర్, కల్తీ రవీందర్తో పాటు మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

