తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 1 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహించిన షేక్ మున్నా బదిలీ కావడంతో సిబ్బంది, ఖాతాదారులు, గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. మేనేజర్‌గా పనిచేసిన కాలంలో గ్రామాల్లో వ్యవసాయదారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారని పలువురు కొనియాడారు. గ్రామదీపికలతో సమీక్షలు నిర్వహిస్తూ సకాలంలో బకాయిలు చెల్లించే వారికి ప్రభుత్వం నుంచి లభించే ఉపశమనాలను వివరిస్తూ పాత బకాయిల వసూళ్లకు కృషి చేశారని తెలిపారు. బకాయిలు చెల్లించిన వారికి కొత్త రుణాలు అందిస్తూ, బ్యాంకు సిబ్బందితో మమేకమై బ్యాంకుకు ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా తీసుకోవాలని ఖాతాదారులకు సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ షేక్ మున్నా మాట్లాడుతూ విధి నిర్వహణలో గ్రామ ప్రజలు, ఖాతాదారులు బ్యాంకుకు అందించిన సహకారం మరువలేనిదని, మున్ముందు కూడా బ్యాంకుకు ఇదే విధంగా సహకరించాలని కోరారు. అనంతరం సిబ్బంది, ఖాతాదారులు, గ్రామస్తులు మున్నాను శాలువాలతో ఘనంగా సన్మానించి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నల్ల రాజు, ఫీల్డ్ ఆఫీసర్లు బానోత్ శ్రీకాంత్, ఫీల్డ్ ఆఫీసర్, ఎన్నిపల్లి మాలతి, ఆఫీసర్, ముత్యాల ఉపేంద్ర, క్యాషియర్, ఎం. వినీత్ కళ్యాణ్, క్యాషియర్ కనికారపు గోవర్ధన్, ఆఫీస్ అసిస్టెంట్ బానోత్ రమేష్, ఎస్బీఐ కస్టమర్ అడ్వైజర్, గండమల్ల సుందర్రావు, గ్రామదీపికలు మెట్టు స్వరూపరాణి, బండ్ల పద్మ, మాజీ సర్పంచ్ భూక్య వీరన్న, కొప్పెర రాంబాబు, స్థానిక రిపోర్టర్లు కూరపాటి విజయ్ కుమార్, కామల్ల వీరయ్య, పోలే పొంగు వెంకన్న, మెట్టు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

