ఖాళీ బిందెలతో నిరసన.. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
గార్ల, సెప్టెంబర్ 3 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చాలా కాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చుట్టూ నీరు ఉన్నప్పటికీ తాగేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు.
గ్రామసభలో ఖాళీ బిందెలతో నిరసన
అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభకు మహిళలు ఖాళీ బిందెలతో తరలివెళ్లి నిరసన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రతి ఇంటికీ క్రమం తప్పకుండా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, సీపీఎం పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

