అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి: టీ జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 2 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో అత్యవసర విధులు నిర్వహిస్తున్న 108 సిబ్బందికి స్థానికంగా నివాస గది సౌకర్యం కల్పించాలని కోరుతూ ఖమ్మం జిల్లా టీ జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ బుధవారం స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ కి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. 108 సిబ్బంది మండల కేంద్రంలోనే నివాసం ఉండేలా ప్రభుత్వం గది సౌకర్యం కల్పిస్తే అత్యవసర సమయాల్లో వారు వెంటనే స్పందించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో 108 సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన గదులు ఖాళీగా ఉన్నందున, వాటిలో ఒక గదిని 108 సిబ్బంది నివాసానికి కేటాయించాలని ప్రభుత్వ అధికారులను కోరారు.
ప్రజావాణిలోనూ వినతి
ఇటీవల తిరుమలయపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇదే విషయంపై స్థానిక ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసినట్లు ఇజ్రాయిల్ తెలిపారు. సమస్యపై ఎంపీడీఓ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. 108 సిబ్బందికి తక్షణమే నివాస వసతి కల్పించి, అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మందడి ఇజ్రాయిల్ కోరారు.

