మరిపెడలో బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమం
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్ పిలుపు
డోర్నకల్/మరిపెడ, సెప్టెంబర్ 2 (నమస్తే న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో మరిపెడలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతి రూ.4,000, రైతు భరోసా రూ.15,000, దళిత బంధు, గిరిజన బంధు, తులం బంగారం, స్కూటీ వంటి హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మాటలు కోటలు దాటినా.. చేతలు గడప దాటలేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 4న సమరభేరి
సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మరిపెడ బంగ్లాలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరుకానున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టేందుకు నిర్వహిస్తున్న ఈ సమరభేరి కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


