రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 01 (నమస్తే న్యూస్): నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న వార్తలను బయ్యారం మండల బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటని మండల బీజేపీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ అన్నారు.బయ్యారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని బయటపెట్టుకుంటోందని విమర్శించారు.“దాడులతో బీజేపీ గొంతును నొక్కలేరు.. హౌస్ అరెస్టులతో మా నాయకుల పోరాటాన్ని ఆపలేరు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ కార్యకర్తలు ఐక్యంగా పోరాడుతారు” అని నాయిని శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బయ్యారం మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

