పలుమార్లు పట్టుబడినా ఆగని అక్రమార్కుల ఆగడాలు.
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఆరోపణ.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 01(నమస్తే న్యూస్):
ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పథకం మరిపెడ మండలంలో మాత్రం కొందరు వ్యాపారులకు,అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారిందని సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఆరోపించారు.మరిపెడ మండల కేంద్రంలో,ఏకంగా డోర్నకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పలుమార్లు అక్రమ రేషన్ బియ్యం బహిరంగంగా దొరుకుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.కొంతమంది అధికారులు,ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ లక్షల్లో దండుకుంటున్నారని,ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం వాహనాలు,గోడౌన్లు పట్టుబడినా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మారగాని బాలకృష్ణ చరవాణి ద్వారా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ విషయంపై వెంటనే జిల్లా కలెక్టర్,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దృష్టి సారించి మరిపెడ మండలంలో జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందాపై సమగ్ర విచారణ జరిపి,దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సిపిఐ మరిపెడ మండలం ఆధ్వర్యంలో దశలవారీగా ప్రజా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.

