ఆపబోయిన కానిస్టేబుల్ పై హత్యాయత్నం.
నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్.మరిపెడ పోలీసుల సాహసం
జిల్లా ఎస్పీ డాక్టర్ శభరీష్ అభినందన.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 01(నమస్తే న్యూస్):
గత కొంతకాలంగా రాత్రి పూట కారులో తిరుగుతూ ఇళ్లలో ఉంచిన మేకలను దొంగతనం చేసి కారులో వేసుకొని పారిపోతున్న ముఠాను మరిపెడ పోలీసులు పట్టుకున్నారు.వాహన తనిఖీలో భాగంగా దొంగల కారును అడ్డుకునే క్రమంలో తప్పించుకోవడానికి కానిస్టేబుల్ ని ఢీకొట్టి చంపే ప్రయత్నం చేసిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు. వివరాలను సీఐ ఎల్.పవన్ కుమార్ వెల్లడించారు.మరిపెడ పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి.ఐపీఎస్ మరియు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అభినందించారు.
సీఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
ఈ రోజు తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో పెట్రోలింగ్ లో భాగంగా రాజీవ్ సెంటర్ వద్ద మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్,పీసీ జి.రవితేజ వాహన తనిఖీ చేస్తున్నారు.అదే సమయంలో కురవి రోడ్డు నుండి మరిపెడ వైపు ఒక తెల్లని కారు వేగంగా వస్తూ,నంబర్ ప్లేట్ కు ముందు వెనుక గుడ్డ కట్టి,ఆపినా ఆపకుండా వారి ముందు వేగంగా మలుపు తీసుకొని వెళ్ళింది.దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును వెంబడించారు. ఆ కారు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో మరిపెడ పట్టణం నుండి కార్గిల్ సెంటర్,సూర్యాపేట రోడ్డులో వెళ్తూ,మళ్ళీ అదే కారు మరిపెడ గ్రామానికి మలుపు తిరిగి,అదే రోడ్డు నుండి మళ్ళీ సూర్యాపేట జాతీయ రహదారి ఎక్కి సూర్యాపేట వైపు వేగంగా వెళ్ళింది. పోలీసులు సైరన్ వేసుకుంటూ,హారన్ కొట్టుకుంటూ వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగకుండా వెళ్లారు.కారు నంబర్ చూడటానికి ప్రయత్నం చేయగా వెనుక గుడ్డ లాంటిది కట్టబడి లేదా డిక్కీలో ఏదో ఉన్నదనే అనుమానం బలపడింది.అంతేకాక ఆ కారు ఆపకపోతే నేరస్తులు వెళ్తున్న వేగానికి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టి చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించారు.
దీంతో ఎస్సై తానంచెర్ల శివారులో కారును వెంబడించి పోలీసు వాహనాన్ని ముందు పెట్టి ఆపే ప్రయత్నం చేశారు.నేరస్తుల కారు వేగం తగ్గించడంతో పోలీసు వాహనంలో వెనుక సీట్లో ఉన్న పీసీ రవితేజ 21 కుడివైపు తలుపు తీసి దిగి,నేరస్తుల కారులో ఉన్న డ్రైవర్ ను దిగాలని చేతితో సైగ చేశారు. అదే సమయంలో నేరస్తుల కారు నడుపుతున్న డ్రైవర్ మళ్ళీ అదే వేగంతో కానిస్టేబుల్ రవితేజ మీదకు వస్తూ ముందుకు వెళ్ళడంతో,కానిస్టేబుల్ రవి పక్కకు తప్పించుకున్నా కుడి చేతికి తగిలి గాయమైంది.వెంటనే కానిస్టేబుల్ రవితేజ అప్రమత్తంగా పక్కకు తప్పుకోకపోతే అతనిని గుద్ది చంపేవారే.పోలీసులకు కారులో గంజాయి ఉన్నదనే అనుమానం బలపడటం మరియు కారు వెళ్తున్న వేగానికి జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం జరిగి చనిపోయే అవకాశం ఉందని ఎస్సై గట్టిగా హెచ్చరిక చేయగా,కారు కొంత దూరం ముందుకు పోనిచ్చి తానంచెర్ల గ్రామం శివారు మరిపెడ-సూర్యాపేట శివారులో ఆపారు.కారు ముందు నంబర్ ప్లేట్,వెనుక నంబర్ ప్లేట్ కు గుడ్డలు కట్టి నంబర్ ప్లేట్ కనపడకుండా ఉంది. కారును తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులు అనగా ముందు ఇద్దరు,వెనుక ఇద్దరు ఉండి కారులో 07 మేకలను కుక్కి ఉండి వాటిపై ఇద్దరు కాళ్ళతో తొక్కి కూర్చొని ఉన్నారు.మరిపెడ పోలీసులు ఈ మేకలు ఎక్కడివి,ఎందుకు వాహనం ఆపకుండా తప్పించుకుపోతున్నారని వారిని అడగగా వారు అందరూ పొంతన లేని సమాధానం చెబుతుండటంతో పోలీసుల దగ్గర ఉన్న ట్యాబ్ మరియు పాపిలాన్ పరికరం ద్వారా ఒక వ్యక్తి వేలిముద్ర తనిఖీ చేయగా అతని పేరు భూక్యా జగదీష్ అని చూపిస్తూ 05 కేసులు భూర్గంపాడు, నర్సంపేట, డోర్నకల్, ములకలపల్లి, దుగ్గొండిలో అతని మీద పాత కేసులు ఉన్నట్లు చూపించింది.ఇంకొక వ్యక్తిని కూడా తనిఖీ చేయగా అతని పేరు భూక్యా శ్రీధర్ గా చూపించి 02 దొంగతనం కేసులు ఉన్నట్లు చూపించింది.దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా వారు అందరూ ఒడ్డురామారం గ్రామం,పూసుగూడెం గ్రామ పంచాయితీ,ములకలపల్లి మండలం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారమని తెలిపి,మేకలు,గొర్రెల దొంగతనం కోసం వీరు నలుగురు ఒడ్డురామారం గ్రామం నుండి హోండా అమేజ్ కారులో వచ్చి కురవి,మరిపెడ ప్రాంతంలో తిరుగుతూ ఎల్లారిగూడెంలో ఒక ఇంట్లో మేకలను దొంగతనం చేసినట్లు చెప్పారు.
నేరస్తుల వివరాలు:
1)భూక్యా జగదీష్ తండ్రి రాములు, 33 సంవత్సరాలు, కులం: ఎస్టీ లంబాడా, వృత్తి: వ్యవసాయం, నివాసం: ఒడ్డురామారం గ్రామం, పూసుగూడెం గ్రామం, ములకలపల్లి మండలం.2)ధరావత్ అశోక్ తండ్రి రాములు,వృత్తి: కారు డ్రైవర్, కులం: ఎస్టీ లంబాడా,నివాసం: ఒడ్డురామారం గ్రామం, పూసుగూడెం గ్రామం, ములకలపల్లి మండలం.3) భూక్యా ప్రసాద్ తండ్రి సక్రు,25 సంవత్సరాలు,వృత్తి: కూలీ, నివాసం: ఒడ్డురామారం గ్రామం,పూసుగూడెం గ్రామం, ములకలపల్లి మండలం.4) లావుడియా శ్రీధర్ తండ్రి బాలు,28 సంవత్సరాలు, వృత్తి: తాపీ మేస్త్రి, నివాసం: ఒడ్డురామారం గ్రామం, పూసుగూడెం గ్రామం, ములకలపల్లి మండలం. వీరందరూ జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకొని మేకల దొంగతనం చేస్తున్నారు.వీరి వద్ద నుండి 03 సెల్ ఫోన్లు, ఒక హోండా అమేజ్ కారు మరియు లక్ష రూపాయల విలువైన 07 మేకలను స్వాధీనం చేసుకున్నారు.



