నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: సేవాలాల్ సేన
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 1 (నమస్తే న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి ఉకే శిరీషపై జరిగిన దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సేవాలాల్ సేన డిమాండ్ చేసింది.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూక్య రవి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఉకే శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన అత్యంత దారుణమని పేర్కొన్నారు.ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షాన్ ఉల్లా ఖాన్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఆదివాసీ మహిళలు, యువతుల భద్రతకు ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రవి కోరారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.“ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయాలి.. ఘటనకు బాధ్యులైన వారికి కఠిన శిక్ష విధించాలి” అని సేవాలాల్ సేన నాయకులు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో అజ్మీర శ్రీకాంత్ నాయక్, జాటోత్ రవి నాయక్, అజ్మీర కళ్యాణ్ నాయక్, భూక్య మోహన్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

