నూతన ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలి
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 1 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని రామచంద్రాపురం, కొత్తపేట, బయ్యారం ప్రాంతాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు మంగళవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల తీరును పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విక్రయదారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎరువుల విక్రయదారులు ఎరువుల విక్రయానికి సంబంధించిన Framework for Fertilizer Sale Appపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులకు ఎరువుల బుకింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విక్రయ కేంద్రాల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
బయ్యారం మండల రైతులు నూతన ఎరువుల బుకింగ్ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎరువుల బుకింగ్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులకు అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలను వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి అందిస్తారని స్పష్టం చేశారు.
రైతులు నూతన విధానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఎరువుల బుకింగ్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి రాజు పాల్గొన్నారు.

