22/ఏ నిషేధిత జాబితా నుంచి నాన్ అగ్రికల్చర్ భూములను గుర్తించాలి
క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలి.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశం
నర్సింహులపేట,సెప్టెంబర్ 1 (నమస్తే న్యూస్)
22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని నాన్ అగ్రికల్చర్ భూములను గుర్తించి నిబంధనల మేరకు క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం 22/ఏ నిషేధిత భూముల జాబితాను కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాబితాలోని భూముల వివరాలు, వాటి స్వభావం, రికార్డుల్లో ఉన్న నమోదులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో వ్యవసాయేతర భూములను గుర్తించి, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. భూముల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా రికార్డులను సరిచూసి, అర్హత ఉన్న వాటికి నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.



