సంఘటితంగా ముందుకు సాగితేనే హక్కులు, అవకాశాలు సాధ్యం: ప్రభుత్వ విప్ డా. రామచంద్రు నాయక్
నర్సింహులపేట,సెప్టెంబర్ 1 (నమస్తే న్యూస్)
పద్మశాలి సమాజం సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా, సంఘటితంగా ముందుకు సాగినప్పుడే హక్కులు, అవకాశాలను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ డా. రామచంద్రు నాయక్‌కు పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న పద్మశాలి కుటుంబాల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని సమస్యలను సంఘటితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మశాలి యువత విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.పద్మశాలి సంఘం మరింత బలోపేతం కావడానికి నాయకులు, సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.
భావోద్వేగానికి గురైన జిల్లా అధ్యక్షుడు
సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల వెంకన్న గతంలో వివిధ రాష్ట్రాల్లో సంఘం కోసం పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ మాట్లాడిన సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సమాజం కోసం తాను చేసిన సేవలు, ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనవడం సమావేశంలో ప్రత్యేకంగా నిలిచింది.జిల్లా పద్మశాలి సంఘం జనరల్ బాడీ సమావేశంలో సంఘం నాయకులు, ప్రతినిధులు, పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


