స్పందించిన ఎంపీడీవో… పెన్షన్ మంజూరి కి హామీ
మానవత్వంతో మెట్లు దిగి వచ్చి దరఖాస్తు స్వీకరించిన రాంప్రసాద్ రావు
“నాకు పెన్షన్ ఇప్పించండి సారూ” అంటూ వేడుకున్న రాంబాబు..
అధికారుల స్పందనకు ప్రశంసలు
నర్సింహులపేట, ఆగస్టు 31 (నమస్తే న్యూస్)
20 ఏళ్లుగా దివ్యాంగుల పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఓ నిరుపేద దివ్యాంగుడి ఆవేదనకు నర్సింహులపేట ఎంపీడీవో రాంప్రసాద్ రావు మానవతా దృక్పథంతో స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన కూరపాటి రాంబాబు లేచి నడవలేని స్థితిలో వీల్‌చైర్‌పై ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని.. “నాకు పెన్షన్ ఇప్పించండి సారూ” అంటూ అధికారులను వేడుకున్నాడు. ఈ దృశ్యాన్ని గమనించిన ఎంపీడీవో రాంప్రసాద్ రావు వెంటనే తన గది నుంచి బయటకు వచ్చి, మెట్లు దిగి స్వయంగా రాంబాబు వద్దకు చేరుకున్నారు. అనంతరం అతని చేతి నుంచి దరఖాస్తును స్వయంగా స్వీకరించారు.వీల్‌చైర్‌లో కూర్చున్న రాంబాబు వద్దకు అధికారి స్వయంగా వచ్చి దరఖాస్తు తీసుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. వెనుక ప్రజావాణి హెల్ప్‌డెస్క్ వద్ద అధికారిణి ఈ దృశ్యాన్ని గమనిస్తున్న సందర్భం అధికారం కంటే మానవత్వమే గొప్పదనే సందేశాన్ని చాటిచెప్పింది.
51 శాతం వైకల్యం నిర్ధారణ
రాంబాబుకు ఇప్పటివరకు సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో దివ్యాంగుల పెన్షన్ అందలేదు. ఇటీవల నిర్వహించిన సదరం ప్రక్రియలో ID: 12130612608210001 ద్వారా అతనికి 51 శాతం అంగవైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. పెన్షన్ దరఖాస్తుకు చివరి రోజు కావడంతో సదరం ఆన్లైన్ కాపీతో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నాడు.
“ఇకనైనా న్యాయం చేయాలి”
20 ఏళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్న రాంబాబు పరిస్థితిని అధికారులు ప్రత్యేకంగా పరిగణించి, నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించి పెన్షన్ మంజూరయ్యేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.దివ్యాంగుడి బాధను అర్థం చేసుకుని స్వయంగా మెట్లు దిగి వచ్చి దరఖాస్తు స్వీకరించిన ఎంపీడీవో రాంప్రసాద్ రావు తీరును గ్రామస్తులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు అభినందించారు. అధికారుల కార్యాలయానికి వచ్చే ప్రతి అర్హుడి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి, ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు.

