పతకాలతో నర్సింహులపేటకు కీర్తి!
నర్సింహులపేట, ఆగస్టు 31 (నమస్తే న్యూస్)
వయసు క్రీడకు అడ్డంకి కాదని నిరూపిస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు మహమ్మద్ ఖాజామియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ఆగస్టు 30న నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ “ఆఫ్ సీజన్” అథ్లెటిక్ మీట్–2026లో 65+ వయస్సు విభాగంలో పాల్గొని రెండు కాంస్య పతకాలను సాధించారు.ఈ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన ఖాజామియా.. అదే ఉత్సాహంతో 1500 మీటర్ల పరుగు పందెంలోనూ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రెండు విభాగాల్లోనూ పట్టుదలతో పరుగెత్తి పతకాలు సాధించడం ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు.పోటీల అనంతరం తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఖాజామియా కాంస్య పతకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు క్రీడాభిమానులు, స్థానికులు అభినందించారు.వయసు పెరుగుతున్న కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనే భావనకు భిన్నంగా.. క్రీడలపై మక్కువతో నేటికీ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్న ఖాజామియా పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువత క్రీడల వైపు అడుగులు వేయాలనే సందేశాన్ని ఆయన విజయాలు చాటుతున్నాయని క్రీడాభిమానులు పేర్కొన్నారు. నర్సింహులపేటకు చెందిన సీనియర్ క్రీడాకారుడు రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు పతకాలు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.



