గ్రామస్థుల విజ్ఞప్తికి స్పందించిన సర్పంచ్
స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైన్ ఏర్పాటు
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం, ఆగస్టు 30 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ ఆరో వార్డులో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ఆరో వార్డులోని చివరి గుంపు నుంచి పెద్దమ్మ గుడి, బతుకమ్మ చెరువు వరకు విద్యుత్ లైన్ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను గ్రామస్థులు సర్పంచ్ కోరస సుమలత నరేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.ఏళ్లుగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ కోరస సుమలత నరేష్, ఆరో వార్డు సభ్యురాలు పూనెం రూపాదేవి ప్రవీణ్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

