డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 30(నమస్తే న్యూస్).
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి రైతు వేదికలు నిదర్శనంగా మారాయని,శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారు పత్తికుంట తండాలో నిర్మించిన రైతు వేదికను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అబ్బాయిపాలెం,అమ్రు నాయక్ తండా,ధారావత్ తండా,గాలివారి గూడెం గ్రామ పంచాయతీలతో పాటు మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 5 వేల మంది రైతులకు ఉపయోగపడేలా మరిపెడ క్లస్టర్ రైతు వేదికను అబ్బాయిపాలెంలో నిర్మించారన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.23 లక్షలు వెచ్చించి నాసిరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారని, అవినీతి, అక్రమాలకు, అధికారుల నిర్లక్ష్యానికి ఈ రైతు వేదికలు నిదర్శనమని ఆరోపించారు.రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువు అలుగు వరద తాకిడికి రైతు వేదిక బయటి ప్రాంతం పాక్షికంగా దెబ్బతిందని,ఈ విషయాన్ని రెండు మూడు సార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోలేదన్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మైనర్ రిపేర్లు చేపట్టి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు బాణాల రాజన్న,గ్రామ శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య,నాయకులు ఎర్ర వెంకన్న, సైదులు,స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు…


