పేదల ప్రాణాలు కాపాడేందుకు ముందస్తు క్యాన్సర్ నిర్ధారణే కీలకం.
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కిమ్స్ (KIMS) ఆసుపత్రి ఆధ్వర్యంలో జఫర్‌గఢ్ మండలం తిడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా హెల్త్ క్యాంప్‌లో అందుబాటులో ఉంచిన అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరికరాలను వైద్య బృందంతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిశితంగా పరిశీలించారు. ఏయే రకాల క్యాన్సర్లను ఈ యంత్రాల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన స్థానిక గ్రామస్తులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, ముందస్తు పరీక్షలతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…. ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రికమైన జీవనశైలి వల్లే ప్రజలు అనేక కొత్త అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడం, వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం వల్లే చాలా మంది పేదలు క్యాన్సర్ బారిన పడి అకాల మరణం చెందుతున్నారని అన్నారు. ఇలాంటి విషాదాలను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ లాంటి ప్రాణంతక వ్యాధులను గుర్తించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే అత్యాధునిక సదుపాయాలతో తిడుగు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య సేవలను కేవలం ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా నియోజకవర్గం అంతటా విస్తరించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకాంక్షించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోనూ త్వరలో ఒక భారీ మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయాలని కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందాన్ని ఆయన కోరారు. దీని కోసం అవసరమైతే తానే స్వయంగా హైదరాబాద్ వెళ్లి కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడుతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. హన్మకొండలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో 100పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని ఈ ఆసుపత్రులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఇంత గొప్ప ఉచిత క్యాన్సర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేసిన తిడుగు గ్రామ సర్పంచ్ సోమయ్య గారికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి వచ్చి నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోమయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.





