పైపులైన్ అభివృద్ధి, విస్తరణ పనులకు శ్రీకారం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
బోయిన్పల్లి, ఆగస్టు 30 (నమస్తే న్యూస్): బోయిన్పల్లి పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. వివిధ కాలనీల్లో రూ.45 లక్షల నిధులతో చేపట్టనున్న పైపులైన్ అభివృద్ధి, విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.ఇక్రిశాట్, బీహెచ్ఈఎల్, మధుపల్, అరిహంత్, సంజీవయ్య, కిరణ్ ఎంక్లేవ్, జవహర్ రైల్వే, జూపిటర్, రాధాస్వామి, ఎల్ఐసీ, ఆర్అండ్టీ, వెంకట్రెడ్డి కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. చిన్న పైపులైన్ల కారణంగా ఏళ్లుగా సరిపడా తాగునీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పైపులైన్ల ఏర్పాటు, విస్తరణతో నీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల సమస్యలను గుర్తించి తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంపై స్థానికులు ఎమ్మెల్యే శ్రీగణేష్కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

