పట్టించుకోని సంబంధిత అధికార యంత్రాంగం
నర్సింహులపేట,ఆగస్టు 29(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో గుడుంబా విక్రయాలు, అక్రమ మద్యం తయారీపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభిస్తున్న అక్రమ మద్యం కారణంగా ముఖ్యంగా యువత మద్యానికి బానిసవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గుడుంబా వంటి అక్రమ మద్యం తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో కొంతమంది యువకులు దానికి ఆకర్షితులవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. గతంలో అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరుకులు, గుడుంబా స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నప్పటికీ.. సమస్య పూర్తిగా అరికట్టబడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ మద్యం అడ్డుకట్టకు దాడులు ఎక్కడ..?
అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం సరఫరా వెనుక ఉన్న వ్యవస్థపై కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం కాకుండా.. నిరంతర నిఘా, తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
యువత భవిష్యత్తు ఎవరి బాధ్యత..?
మద్యం మత్తులో యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గ్రామస్థాయిలో యువతకు క్రీడలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు అక్రమ మద్యం మూలాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఇకనైనా సంబంధిత ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నర్సింహులపేట మండలంలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపి యువతను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

